మధిర, వెలుగు: పరీక్షల భయంతో ఓ ఇంటర్ స్టూడెంట్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మాదాపురం గ్రామానికి చెందిన తుడుం సమీరా బోనకల్ మండలకేంద్రంలోని మధిర సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. శుక్రవారం ఉదయం తరగతులు జరుగుతుండగా టాయిలెట్‌కు వెళ్తానని చెప్పి క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చింది.
టాయిలెట్‌కు వెళ్లకుండా, మూడో అంతస్తుకు వెళ్లే గేటు తాళాన్ని తన వద్ద ఉన్న కీతో తీసి పైకి వెళ్లింది. అనంతరం భవనం వెనుక వైపు ఉన్న రైతు వేదిక దిశగా ఒక్కసారిగా పైనుంచి కిందకు దూకింది. దూకిన ప్రదేశంలో కొంత ఇసుక ఉండడంతో ప్రాణాపాయం తప్పింది. కానీ చేతి, కాలి, నడుము భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి.
విద్యార్థిని కింద పడటాన్ని సమీపంలోని రైతు వేదికలో శిక్షణ తరగతులకు హాజరై వార్డు మెంబర్లు గమనించారు. వారు వెంటనే సమీరాను పీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సమీరా గత రాత్రి నుంచి తీవ్రమైన తలనొప్పితో బాధపడుతోందని, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలనో లేదోనన్న ఆందోళనతో మానసిక ఒత్తిడికి గురైనట్లు తోటి విద్యార్థులు, ప్రిన్సిపాల్ తెలిపారు. తహసీల్దార్ మద్దెల రమాదేవి, ఎంఈవో పుల్లయ్య ఘటనా వివరాలను సేకరించారు.
